తెలివి తక్కువ సింహం - Clever lion - Telugu Moral Stories
అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సింహం చాలా బలమైనది. రోజు రోజూ ఒక జంతువును చంపేసి తినేసేది. ఒకొక్క సారి ఆకలి లేకపోయినా ఆట కోసం వేరే జంతువులను చంపేసేది.
అడవిలో జంతువులన్నీ ప్రాణ భయంతో ఉండేవి. ఈ సమస్యని ఎడురుకోవడం ఎలా అని ఒక రోజు అన్ని జంతువులూ కలిసి అలోచించాయి. అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.
అనుకున్న ప్రకారం నక్క చేత సింహానికి కబురు పెట్టాయి. ఒక పెద్ద చెట్టు కింద జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి. సింహం కూడా కొద్ది సేపటికి వచ్చింది.
ఒక ముసలి కోతి సింహంతో ఇలా అంది, “మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా థాంక్స్.” సింహం దర్జాగా తల ఊపింది.
కోతి అంది, “మీరు భోజనానికి రోజుకొక్క జంతువుని చంపడం సమంజసమే. మీకు ఆహారం కావాలి. కాని అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు. మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కళ్ళని చీటీలు వేసుకుని ఎంచుకుంటాము. ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో, ఆ జంతువు నేరుగా మీ గుహకు వచ్చి మీకు ఆహరం అవుతుంది. ఈ ఒప్పందం మీరు ఒప్పు కుంటే అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండొచ్చు”
సింహం కి ఐడియా నచ్చింది. అడివిలో జంతువులు వాటంతట అవే బలవుతుంటే రోజూ వేటకి వెళ్ళే పని ఉండదు, హాయిగా ఉండచ్చు అనుకుని సింహం ఒప్పుకుంది.
రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రాకారం సింహానికి బాలి అవ్వడం మొదలెట్టాయి.
కొన్ని రోజులకి ఒక కుందేలు వంతు వచ్చింది. పాపం కుందేలు చాలా భయ పడిపోయింది. దానికి బలి అవ్వాలని అస్సలు లేదు. ఎలాగ రా భగవంతుడా అని చాలా ఆలోచించింది. ఎలాగో గుండెను గట్టి చేసుకుని ఆ సింహం గుహ వైపుకు బయలుద్యారింది. దారిలో ఒక నుయ్యి కనిపించింది. నూతిలో నీళ్ళు చూస్తే ఒక ఐడియా వచ్చింది. అక్కడే పొద్దు పోయే దాకా కూర్చుని, సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటూ సింహం దెగ్గిరకి వెళ్ళింది.
పొద్దుటి నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా రుస రుసలాడుతూ, కోపంగా గుహ ముంగిట్లో పచార్లు చేస్తోంది.
కుందేలుని చూడంగానే “ఎమిటి ఇంత ఆలస్యం?” అని కోపంగా గర్జించింది.
కుందేలు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, “క్షమించండి మహారాజా! నేను పొద్దున్నే మీ వద్దకు రావటానికి బయలుద్యారాను. కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది. అది నన్ను తినబోతుంటే, ఈ రోజు నేను మీకు ఆహారాన్ని అన్న విషయం చెప్పాను. ఆ సింహం అస్సలు మాట వినలేదు. ఈ అడివికి నేనే రాజుని, అని నాతొ చెప్పి నా పైకి దుంకి నన్ను పట్టుకుందామని ప్రయత్నించింది. నేను ఎలాగో ప్రాణాలు కాపాడుకుని మీ దెగ్గరకు వచ్చాను!” అని చెప్పింది.
అసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా భగ్గున మండింది. “ఎక్కడ ఆ సింహం! చూపించు నాకు!” అంది.
కుందేలు సింహాన్ని నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. మరో సింహం నూతిలో ఉంటుందని చెప్పింది.
సింహం నూతిలోకి చూసింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని అపోహ పడి గర్జించింది. ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది. సింహం తన ప్రతిబింబం తోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దుంకేసింది. అందులోని నీళ్ళల్లో మరణించింది.
కుందేలు ప్రాణాలతో ఇలా తప్పించుకుంది. అడివిలో మిగిలిన జంతువులకు జరిగినది చెప్పింది. జంతువులన్నీ కుందేలు చాతచక్యం మెచ్చుకున్నాయి. ఆ రోజునుంచి ప్రశాంతంగా అడవిలో నివసించాయి.
బలం కన్నా బుద్ధి గొప్పదని నిరూపించడానికి ఈ కథ మరో నిదర్శనం.